Reading Time: < 1 minute
Ap Weather Alert Rain Forecast For Next 5 Days Southwest Monsoon Near Andaman

AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాల రాకకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.

ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్-నికోబార్ దీవులకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాధ కుమార్ చెప్పారు. ప్రస్తుతం నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.

మరోవైపు మధ్యప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత కొనసాగవచ్చని అధికారులు పేర్కొన్నారు.