Reading Time: 2 minutes
Raghav Chadha Joins Bjp Aap Mps Defection Ashok Mittal Kejriwal Shock

ఆమ్ ఆద్మీ పార్టీకి మండు వేసవిలో భారీ షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే లిక్కర్ స్కామ్ నుంచి తేరుకుంటున్న సమయంలో రాఘవ్ చద్దా రూపంలో భారీ సంక్షోభం ముంచుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఊహించని రీతిలో రాఘవ్ చద్దా బీజేపీ పంచన చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కాషాయ గూటికి చేరారు. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు అశోక్‌ మిట్టల్, సందీప్‌ పాఠక్‌ కూడా చేరారు. వీరికి స్వయంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు. మరో నలుగురు ఎంపీలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభలో మొత్తం ఆప్‌కు 10 మంది ఎంపీలు ఉండగా ఏడుగురు తిరుగుబావుటా ఎగరేయడంతో అన్హరత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇది ఆప్‌కు ఊహించని షాక్.

అశోక్ మిట్టల్..
అశోక్ మిట్టల్.. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తే తన బంగ్లాలో ఉండాలని అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. దీంతో ఏడాది పాటు కేజ్రీవాల్.. అశోక్ మిట్టల్ నివాసంలోనే ఉన్నారు. కానీ ఈ స్థాయిలో వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు. ఒకప్పుడు కేజ్రీవాల్ పట్ల విధేయత చూపించిన వాళ్లే.. ఇప్పుడు ద్రోహులుగా మారిపోయారు.

Ashok

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాకు ఆప్ షాకిచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దా‌ను తప్పించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను కూడా పంపింది. అంతగా అశోక్ మిట్టల్‌ను కేజ్రీవాల్ నమ్మారు. కానీ అతడే వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు.

రాఘవ్ చద్దా ఒక్కరే పార్టీ వీడుంటే అనర్హత వేటు పడేది. ఆ వేటు నుంచి తప్పించుకునేందుకు తనతో పాటు మరో ఆరుగురు ఎంపీలను తీసుకెళ్లిపోయారు. రాఘవ్ చద్దాతో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ బీజేపీ గూటికి చేరుతున్నారు.