
హైదరాబాద్ లో ఏజే మార్కెట్ చౌరస్తాలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్స్ ,ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. సుమారు వందకు పైగా ఆటోలతో ‘చక్కా జామ్’ నిర్వహించి రోడ్డును దిగ్బంధించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జిహెచ్ఎంసీ పరిధిలో ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న ఆటోలను వెంటనే నిలిపివేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఎల్లో ప్లేట్ లేని వాహనాలను ఆపరేట్ చేస్తున్న ఓలా, ఉబెర్, రాపిడో వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గళమెత్తారు. మా పొట్ట కొడుతున్న అక్రమ రవాణాను అరికట్టాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇక చార్జీల విషయానికొస్తే.. గత 15 ఏళ్లుగా మీటర్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే మీటర్ ఛార్జీలను సవరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఆటో డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా.. ప్రతి ఏటా డ్రైవర్లకు 12 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గంటన్నర పాటు సాగిన ఈ ఆందోళనతో ఏజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు, డ్రైవర్లతో చర్చలు జరిపి వారిని శాంతింపజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు. ఆ తర్వాతే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు.