
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ . అశ్విన్ చంద్రశేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు ( ఫిబ్రవరి 14 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే .. వెండితెరపై ఏదో రొమాంటిక్ మ్యాజిక్ జరుగుతుందని సినీ ప్రియులు ఆశిస్తారు. కానీ ఈ మూవీ ఆ మూస పద్ధతులను పక్కన పెట్టింది. నేటి యువత ఎదుర్కొనే నిజమైన సవాళ్లను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఒక ప్రేమకథగానే కాకుండా ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమైందా.. లేదో చూద్దాం..
కథనం
ఈ మూవీలో శివ (సంతోష్ శోభన్) మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. కెరీర్ పట్ల సందిగ్ధత, ఆర్థిక ఇబ్బందులు, ఆందోళనతో ఉన్న యువకుడిగా సంతోష్ శోభన్ తన నటనకు ప్రాణం పోశాడు. శివ ఇంటీరియల్ డిజైనర్ కావాడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాత్రలో ఆకట్టుంటాడు. ముఖ్యంగా ఒక డీసెంట్ క్లయింట్‌ను పట్టుకోవడానికి అతను పడే తాపత్రయం, ఒక మధ్యతరగతి యువకుడి ‘క్వైట్ డెస్పరేషన్’ను అద్దం పడుతుంది.
ఇక మానస వారణాసి పోషించిన మిత్ర పాత్ర ఈ సినిమాకు ఆత్మ వంటిది. ఆమె కేవలం హీరో వెనుక తిరిగే పాత్ర కాదు. తన సొంతంగా సమస్యలను పరిష్కరించుకుంటూ, ఆఫీసు రాజకీయాలను తట్టుకుంటూ నిలబడే గట్టి అమ్మాయి. మిత్ర పాత్రలో మానస ఎంతో సహజంగా ఒదిగిపోయారు. అనుకొని పరిస్థితుల ద్వారా శివ, మిత్ర కలుస్తారు. చివరికి ఒక గదిని పంచుకుంటారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా మెల్లగా, స్నేహం ద్వారా బలపడుతుంది..
సాంకేతిక విలువల బలం
ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఆదిత్య రవీంద్రన్ సంగీతం. పాటలు కథలో భాగంగా వస్తూ భావోద్వేగాలను పండిస్తాయి. సినిమాను నిజమైన చెన్నై లోకేషన్లలో చిత్రీకరించడం వల్ల ఒక రకమైన ఆర్గానిక్ ఫీల్ వస్తుంది. బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే సహజమైన మాటలు, పరిసరాలు సినిమాకు ప్రాణం పోశాయి. దర్శకుడు కథను చెప్పడానికి వాడిన డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ ప్రయోగాత్మకంగా ఉన్నా, ప్రారంభంలో ప్రేక్షకుడిని కాస్త అయోమయానికి గురిచేశాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది..
Done with my show 👌
Fresh love story with modern relationship touch 💕
Engaging first half, emotional & meaningful second half ❤️
Manchi feel ni ichhe cinema 👌
Worth watching with your special one 🔥#CoupleFriendly pic.twitter.com/O1cwimArft— Maneesh (@Humanism457) February 14, 2026
లోపాలు , మలుపులు
ఫస్టాఫ్ అంతా ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోతుంది. నగరంలోకి తొలి సారి వచ్చి కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత ఎదుర్కొనే వాస్తవ ఇబ్బందులు చూపించే విధానం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ, సెకండాఫ్ ఒక్కసారిగా ఎమోషనల్ రూట్ మారిపోతుంది . వీరు కలిసి ఉండటం కుటుంబ సభ్యులకు తెలిసినప్పుడు వచ్చే మలుపు సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ ట్రాన్సిషన్ కొంచెం వేగంగా జరిగినట్లు అనిపిస్తుంది. అయితే, ఆధునిక సంబంధాల్లో ఉండే సంక్లిష్టతలను, కుటుంబాల ఒత్తిడిని దర్శకుడు నిజాయితీగా చూపిండాన్న టాక్ వినిపిస్తోంది. మిత్ర తండ్రిగా రాజీవ్ కనకాల పాత్రకు న్యాయం చేశారు.
సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్ కు కాస్త ఊరటనిచ్చేలా ఉందంటున్నారు ప్రేక్షకులు. రొమాంటిక్, ఎమోషనల్ జర్నీని చక్కగా ఉంది. యువత ఎదుర్కొనే వాస్తవ ఇబ్బందులు చూపించే విధానం డైరెక్టర్ సఫలం అయ్యారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కపుల్ ఫ్రెండ్లీ’ ఒక పరిపూర్ణమైన సినిమా కాకపోవచ్చు, కానీ ఇది హృదయానికి హత్తుకుంటుంది. సంతోష్ శోభన్ కెరీర్‌లో ఇదొక మంచి అడుగు కాగా, మానస వారణాసికి ఇది చక్కని లాంచ్ ప్యాడ్. కేవలం గాలిలో తేలే ప్రేమకథలు కాకుండా, ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్..