Reading Time: 2 minutes

Lavanya Tripathi: మళ్ళీ వచ్చేస్తున్న అందాల రాక్షసి.. లావణ్య ‘సతీ లీలావతి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

Caption of Image.

మెగా కోడలు, టాలీవుడ్ ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి కొణిదెల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన  లేటెస్ట్  చిత్రం ‘సతీ లీలావతి’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వేసవి కానుకగా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్‌తో వివాహం, ఆ తర్వాత తల్లిగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన లావణ్యకు, ఇది ‘సెకండ్ ఇన్నింగ్స్’లో అత్యంత కీలకమైన చిత్రం.

మే 8న థియేటర్లలోకి ‘లీలావతి’

గతంలో మార్చి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. లేటెస్ట్ గా చిత్ర యూనిట్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌ను దక్కించుకుంది..

ఆకట్టుకునే కథాంశం

భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి గొడవలు, ఇద్దరి మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో లీలావతిగా లావణ్య త్రిపాఠి నటించగా, ఆమె భర్త పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. ‘శాకుంతలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దేవ్ మోహన్, ఈ చిత్రంతో మరోసారి తన నటనను నిరూపించుకోనున్నారు. ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్ డ్రామాను వినోదాత్మకంగా మలచడంలో దర్శకుడు తాతినేని సత్య తనదైన ముద్ర వేశారని సమాచారం.

భారీ అంచనాలతో..

‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఎస్‌ఎంఎస్’ వంటి హిట్ చిత్రాలను అందించిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో, నాగమోహన్ బాబు, రాజేష్ టి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, సప్తగిరి, వి.టి.వి. గణేష్, రాజేంద్రన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్లాస్ మెలోడీస్ అందించడంలో స్పెషలిస్ట్ అయిన మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.

పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రమోషన్ల హోరును పెంచాలని భావిస్తోంది. మరి ఈ ‘సతీ లీలావతి’తో లావణ్య బాక్సాఫీస్ వద్ద తన మేజిక్‌ను పునరావృతం చేస్తారో లేదో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.