Reading Time: < 1 minute

శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు… లోక కళ్యాణం కోసం గిరిప్రదక్షిణ.

Caption of Image.

శ్రీశైల ద్వార క్షేత్రాలలో ఏప్రిల్ 27 నుండి 30 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గిరిప్రదక్షిణగా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి ఆయా ద్వారక్షేత్రాలలో ప్రత్యేక పూజలను జరిపించిన తరువాత చివరి రోజున అనగా 2026 మే 1న శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ అర్చనలలో ప్రతి ఆలయంలోను శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం, అమ్మవారికి  సహస్రనామార్చన నిర్వహిస్తారు.

ఈ విశేష కైంకర్యంలో శ్రీశైల దేవస్థానం తరుపున ప్రతీ ఆలయంలోను అక్కడ అధిదేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. అదే విధంగా ప్రతీ ఆలయంలోను అర్చక సత్కారం చేస్తారు.  ఈ సత్కార కార్యక్రమంలో ఆయా ఆలయాలలోని ప్రధాన అర్చకులకు, ఉపప్రధానార్చకులకు దేవస్థానం తరుపున  నూతన వస్త్రాలు, శ్రీ స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, సంభావన అందజేస్తారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 27 నుంచి శ్రీశైలక్షేత్ర తూర్పుద్వారమైన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలోనూ, 28న దక్షిణ ద్వారమైన కడప జిల్లాలోని సిద్ధవటంలోనూ, 29న పశ్చిమద్వారమైన తెలంగాణా రాష్ట్ర జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలోనూ, 30న నాగర్‌కర్నూలు జిల్లాలోని ఉత్తరద్వారమైన ఉమామహేశ్వరంలో పూజలను నిర్వహించడం జరుగుతుంది. 

చివరగా మే 1న శ్రీశైలంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా విశేషపూజలు జరుగుతాయి. శ్రీశైలానికి నేరుగా రోడ్డుమార్గం లేని పూర్వపు రోజులలో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలాన్ని చేరుకోవడంతో ఈ నాలుగు క్షేత్రాలు శ్రీశైల ద్వార క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కాయి.

©️ VIL Media Pvt Ltd.