
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (TGREDCO) భూస్వాములు, వాణిజ్య సంస్థల నుంచి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానిస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న ప్రదేశాల్లో ఈ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తూ, హైదరాబాద్‌తో పాటు వరంగల్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ వంటి కీలక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
హైదరాబాద్ వెలుపల ప్రాంతాల్లో ప్రస్తుతం ఛార్జింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్టుకు మంచి స్పందన లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ సదుపాయాలు భవిష్యత్తులో మరింత అవసరమవుతాయని వారు చెబుతున్నారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే కనీసం 200 చదరపు గజాల స్థలం ఉండాలి. అది కూడా ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో, మార్కెట్‌లు లేదా మాల్స్ సమీపంలో ఉంటే ఇంకా మంచిది. వీటితో పాటు ఆ ప్రాంతంలో జనాలు 24 గంటల రాకపోకలు సాగించేలా ఉండాలి, వాహనాలు పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ కనెక్షన్ కూడా తప్పనిసరి. ఒక వేళ మీ దగ్గర ఇవన్ని ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు అని అర్థం. మీరు వెంటనే దీని కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు మౌలిక సదుపాయాల ఖర్చుపై 80 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది. దీని ద్వారా భూస్వాములకు స్థిరమైన ఆదాయ వనరు లభించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
ధరఖాస్తు కోసం ఏ పత్రాలు కావాలి?
అర్హులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి .. భూస్వామ్య పత్రాలు, గుర్తింపు ఆధారం, స్థల ఫోటోలు, లేఅవుట్ వివరాలు, విద్యుత్ కనెక్షన్ సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. మే 3 వరకు ఇందుకోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం అధికారుల ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న వారు టీజీ రెడ్కో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 63049 03957, 63049 03935 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల యుగం వైపు దూసుకెళ్తున్న తెలంగాణలో, ఈ పథకం భూమి ఉన్న వారికి ఒక మంచి ఆదాయ అవకాశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.