Reading Time: < 1 minute
Akshay Kumar Daughter Cyber Bullying Case Accused Arrested Maharashtra Police

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నిత్తారా (Nitara) సైతం వేధింపులకు గురికావడం సంచలనం సృష్టించింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) యశస్వి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో అక్షయ్ కుమార్ కుమార్తె చూపిన ధైర్యం కీలకమని పోలీసులు తెలిపారు. “ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడం వల్లే మేము నిందితుడిని పట్టుకోగలిగాము. ఇలాంటి విషయాల్లో పిల్లలు మౌనంగా ఉంటే నేరగాళ్లు మరింత రెచ్చిపోతారు” అని అధికారులు పేర్కొన్నారు.

గతంలో ముంబైలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడు ఆమెకు మెసేజ్‌లు పంపాడని, అసభ్యకరమైన ఫొటోలు (Nude Photos) పంపాలని వేధించినట్లు తెలిపారు. అయితే, ఆ చిన్నారి భయపడకుండా వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడం విశేషం. అక్షయ్ కుమార్ వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అక్షయ్ తీసుకున్న చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.