Reading Time: < 1 minute

నర్సాపూర్ రూపురేఖలు మార్చడమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. నగర అభివృద్ధి పథకం కింద రూ.15 కోట్లతో చేపట్టనున్న పలు  అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. నర్సాపూర్ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఈ నిధులు వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు.

పర్యటనలో భాగంగా మంత్రి 4వ ,6వ వార్డుల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన దుద్దాల దుర్గమ్మ, మహమ్మద్ షకీరా బేగం నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించిన మంత్రి, పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం నారాయణపూర్ గ్రామంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ వార్డుల్లో పర్యటించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటేనే మంచి ఫలితాలు సాధించగలమని మంత్రి గుర్తుచేశారు.

విద్యా వ్యవస్థ బలోపేతంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా వసతులు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపేలా అవగాహన కల్పించాలని కోరారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచాలని పిలుపునిచ్చారు.కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. నర్సాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.