
- ఆర్టీసీ కార్మికులకు రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ చనిపోయారు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదని, రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, తోటి కార్మికుల హక్కుల సాధనకు ప్రాణత్యాగానికి సిద్దపడ్డ శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాళ్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో.. ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతోనే ఆర్టీసీ కార్మికులు నిరాశలో ఉన్నారన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకుని కార్మికులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా మిగిలి ఉంటుందన్నారు.