Reading Time: 2 minutes
Drinking Water: ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం నాటి ఈ పద్ధతులు పాటించండి

మండే ఎండల్లో ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లు సేదదీరించేలా చేస్తాయి. అయితే చల్లని నీళ్లు తక్షణ ఉపశమనం ఇచ్చినా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధిక చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్ ఉండదు. కొన్నిసార్లు విద్యుత్ అంతరాయం కారణంగా ఫ్రిజ్ పని చేయదు. ఇలాంటి సందర్భాల్లో పురాతన పద్ధతుల ద్వారా సహజంగా నీళ్లు చల్లగా మార్చవచ్చు. విద్యుత్ లేకుండా నీటిని చల్లగా ఉంచుకోవడానికి ఈ కింది చిట్కాలను ఉపయోగించవచ్చు..

  • నీటిని చల్లగా ఉంచడానికి అత్యంత పురాతనమైన, శాస్త్రీయమైన మార్గం.. మట్టి కుండను ఉపయోగించడం. కుండ ఉపరితలంపై ఉండే వేలాది చిన్న రంధ్రాల ద్వారా నీరు బయటకు ఇంకి ఆవిరైపోతుంది. దీనివల్ల కుండ లోపల ఉన్న నీళ్లు సహజంగా చల్లగా ఉంటుంది.
  • అలాగే ఒక గాజు లేదా స్టీల్ సీసాలో నీళ్ళు నింపి, దానిని ఒక మందపాటి కాటన్‌ గుడ్డలో లేదా గోనె సంచిలో చుట్టాలి. గుడ్డ ఆరిన తర్వాత మళ్ళీ దానిపై నీళ్ళు పోయాలి. ఈ విధంగా నీరు ఆవిరైపోవడం వల్ల సీసాలోని నీళ్లు చాలా సేపటి వరకు చల్లగా ఉంటాయి.
  • నీటితో నింపిన పాత్రను నేరుగా సూర్యరశ్మి పడని, గాలి ప్రసరణ ఉండే గది మూలలో ఉంచాలి. కిటికీ పక్కన లేదా బాల్కనీలోని నీడ ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల నీళ్లు సహజంగా చల్లగా ఉంటాయి.
  • ఒక పెద్ద కుండలో ఇసుకను మందంగా పరచి, నీటితో తడపాలి. ఇప్పుడు ఆ తడి ఇసుక మీద ఒక మట్టి కుండను లేదా నీళ్ల సీసాను ఉంచాలి. అయితే ఇసుకను ఆరనివ్వకూడదు. ఎల్లప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా నిల్వ చేసిన ఇసుక రిఫ్రిజిరేటర్ లాగా పనిచేస్తుంది.
  • రాగి పాత్రలో నీటిని ఉంచడం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, భూమి ఉష్ణోగ్రతకు దగ్గరగా నీటిని చల్లగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. రాగి ఉష్ణానికి మంచి వాహకం కాబట్టి, అది బయటి వేడి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. రాగి బాటిల్‌ నీళ్లు అందుకే చల్లగా ఉంటాయి.
  • వాటర్‌ బాటిల్‌ను తడి టవల్ లేదా గుడ్డలో చుట్టి ఫ్యాన్ కింద పెట్టాలి. ఫ్యాన్ గాలి గుడ్డలోని నీటిని ఆవిరి చేస్తుంది. దీనివల్ల బాటిల్‌లోని వేడి తగ్గి నీరు చల్లబడుతుంది.
    వీలైతే పెరట్లో లేదా తోటలో ఒక గుంత తవ్వి, అందులో నీటితో నింపిన పాత్రను ఉంచడాని ప్రయత్నించాలి. దానిపై ఇసుక పొరను వేయాలి. బయటి ఉష్ణోగ్రత కంటే భూమి లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల నీళ్లు చాలా సేపటి వరకు చల్లగా ఉంటుంది.
  • నీటి పాత్ర చుట్టూ ఎండు గడ్డిని ఉంచాలి. ఇది వేడి గాలి పాత్రను తాకకుండా నిరోధిస్తుంది. తద్వారా నీటి ఉష్ణోగ్రత అంత సులభంగా పెరగకుండా అడ్డుకోవచ్చు. ఈ పద్ధతులు నీళ్లను చల్లగా సహజంగా చల్లగా ఉంచుతాయి. మీరూ ట్రై చేయండి..

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.