ఫ్రిజ్లో పెట్టేముందు ఈ పని తప్పనిసరి: చాలామంది పాల ప్యాకెట్లు తెచ్చిన వెంటనే అలాగే ఫ్రిజ్లో పెట్టేస్తుంటారు. కానీ ఎండకాలంలో ఇది సరైన పద్ధతి కాదు. పాలు తెచ్చిన వెంటనే వాటిని శుభ్రమైన పాత్రలోకి మార్చి, బాగా మరిగించాలి. పాలను మరిగించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలు పూర్తిగా చల్లారిన తర్వాతే ఫ్రిజ్లో భద్రపరుచుకోవాలి.
ఫ్రిజ్ డోర్ దగ్గర పాలు పెడుతున్నారా?: సాధారణంగా మనం పాలు లేదా ఇతర పానీయాల డబ్బాలను ఫ్రిజ్ తలుపు వైపు ఉన్న అరల్లో పెడుతుంటాం. కానీ ఇది పాలకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిజ్ తెరిచిన ప్రతిసారీ బయట వేడి గాలి తగిలి ఉష్ణోగ్రత మారేది అక్కడే. కాబట్టి పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి వైపు ఉండే అరల్లో ఉంచాలి. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది.
రెండుసార్లు మరిగించడం మేలు: సాధారణ రోజుల్లో ఒకసారి మరిగిస్తే సరిపోతుంది కానీ, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఉదయం మరిగించిన పాలు రాత్రికి పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాయంత్రం వేళ పాలను మరోసారి వేడి చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు ఉదయం వరకు పాలు తాజాగా ఉంటాయి.
ఫ్రిజ్ లేని వారు ఇలా చేయండి: ఒకవేళ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేకపోయినా, లేదా కరెంటు కోత ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందక్కర్లేదు. ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని తీసుకుని, పాల గిన్నెను అందులో ఉంచండి. నీటి చల్లదనానికి పాలు త్వరగా పాడవ్వవు. మధ్యమధ్యలో ఆ నీటిని మారుస్తూ ఉంటే పాలు రోజంతా నిల్వ ఉంటాయి.
పాత్రల విషయంలో జాగ్రత్త: పాలు మరిగించడానికి ఉపయోగించే గిన్నెలు అత్యంత శుభ్రంగా ఉండాలి. పాత్రలో కొంచెం పాత పాలు ఉన్నా లేదా సరిగ్గా కడగకపోయినా తాజా పాలు వెంటనే విరిగిపోతాయి. పాలు మరిగించే ముందు పాత్రను ఒకసారి చల్లటి నీటితో కడిగితే, పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయి.




