Reading Time: 2 minutes

టాలీవుడ్‌కు గ్రహణం.. వరుసగా వాయిదా పడుతున్న స్టార్ హీరోల చిత్రాలు.. బాక్సాఫీస్ వెలవెల!

Caption of Image.

తెలుగు సినీ పరిశ్రమ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు, పక్కా ప్లానింగ్‌కు మారుపేరు. ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు విడుదల చేసే హీరోలు మన దగ్గర ఉండేవారు. కానీ, ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. ‘షెడ్యూల్డ్ రిలీజ్’ అనే మాట టాలీవుడ్ డిక్షనరీ నుంచి మాయమవుతోంది. అగ్ర హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరి సినిమాలు వాయిదాల పర్వంలో చిక్కుకుంటున్నాయి. వేసవిలో సందడి చేయాల్సిన పెద్ద చిత్రాలు వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది ( 2026 ) సమ్మర్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది.

వరుసగా తప్పుతున్న రిలీజ్ డేట్స్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సంక్రాంతికే రావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వంటి పనుల కారణంగా వాయిదా పడింది. భారీ అంచాలతో వస్తుందనుకున్న ఈ సినిమా అభిమానులను నిరాశపరుస్తోంది. కానీ దీనికంటే లేట్ గా షూటింగ్ ప్రారంభించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టేసింది. ఇది మెగాఫ్యాన్స్ కు సంబరాల్లో నింపింది.

ఇక రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ పరిస్థితి కూడా అంతే. ఇప్పటికే రెండు సార్లు తేదీలు మారిన ఈ చిత్రం, ఇప్పుడు జూన్ నెలాఖరుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్స్ విషయంలో అత్యంత వేగంగా ఉండే నాని సైతం ఈసారి ఒత్తిడికి లోనవుతున్నారు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ వేసవి నుంచి ఆగస్టుకు మారింది, అయినా ఇంకా షూటింగ్ పనులు పూర్తి కాలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ పరిస్థితి మరింత విభిన్నంగా మారింది. ఈ చిత్రాన్ని తొలుత 2026 జూన్ అనుకున్నప్పటికీ షూటింగ్ జాప్యం వల్ల ఏకంగా జూన్11, 2027కి వాయిదా పడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జాప్యానికి కారణాలేంటి?

గతంలో రోజుకు 15 నుంచి 20 సీన్లు తీసేవారు. కానీ ఇప్పుడు మేకర్స్ క్వాలిటీ కోసం రోజుకు కేవలం 4 లేదా 5 సీన్లకే పరిమితమవుతున్నారు. దీని వల్ల షూటింగ్ రోజులు పెరిగిపోతున్నాయి. మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మునుపటి కంటే పదింతలు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి. అంతే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఇతర భాషల నటులను తీసుకోవడం ఇప్పుడు అనివార్యమైంది. అయితే, ఏ ఒక్క నటుడి డేట్లు కుదరకపోయినా షూటింగ్ ఆగిపోతోంది. దీనివల్ల నెలల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు.

ఆర్థిక చిక్కులు.. 

మరో వైపు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నగదు లభ్యత తగ్గింది. వడ్డీలు పెరగడం, ఓటీటీ సంస్థలు సినిమా పూర్తయ్యాకే కొంటామని నిబంధనలు పెట్టడంతో నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే షూటింగ్ చేస్తామని యూనియన్ సభ్యులు పట్టుబట్టడం కూడా మరో సవాలుగా మారింది. ఒకప్పుడు ఏటా 200 పైగా సినిమాలు విడుదలయ్యే టాలీవుడ్‌లో, ఇప్పుడు సకాలంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడమే అతిపెద్ద సవాలుగా మారింది. ఈ జాప్యం వల్ల బడ్జెట్లు పెరిగి, నిర్మాతలు భారమైన వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ గందరగోళం నుంచి టాలీవుడ్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.