
పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతపు గోడలపై ‘పార్లమెంట్ పందులదొడ్డి’ అనే నినాదం కనబడేది. ఎన్నికల ద్వారా కాకుండా, సాయుధ విప్లవం ద్వారానే సామాన్యుల ఆకాంక్షలు నెరవేరే పాలన దేశంలో సాధ్యపడుతుందని ఆ పార్టీ నమ్మినందువల్ల ఆ నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. 2004లో మరో విప్లవ పార్టీతో కూడిన పీపుల్స్ వార్.. మావోయిస్టు పార్టీగా అవతరించినా అదే మాటపై కట్టుబడి ఉంది. దేశంలో ఎన్నికలు వచ్చిన సమయంలో ‘ఎన్నికలను బహిష్కరించండి’ అని పిలుపునిచ్చేది. అలాంటి ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం సిబ్బందికి కత్తిమీద సాములా ఉండేది. ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత 11 జిల్లాల్లో 1998 నుండి 25 ఏళ్ల పాటు ఏ ఎన్నికా ప్రశాంతంగా జరగలేదు. 2024లో మాత్రమే మావోయిస్టుల చర్యలు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాధ్యపడింది అని అక్కడి పత్రికలు రాశాయి. ఇవే పరిస్థితులు చత్తీస్‌గఢ్‌లోను కొనసాగాయి. రవాణా సౌకర్యం సరిగ్గా లేని అటవీప్రాంతాల్లో ఎన్నిక నిర్వహణ ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించేది. 2017లో వచ్చిన న్యూటన్ అనే హిందీ సినిమాలో చత్తీస్‌గఢ్ గ్రామీణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ బహిష్కరణకు సంబంధించిన సన్నివేశాలు చూడవచ్చు.
కాల మార్పును సూచించే మరో సంఘటన ఏమిటంటే చత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన తీవ్రవాద యువతకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాల్లో భర్తీ చేసుకుంది. ఓటేసినట్లు వేలుకి ఇంకు కనబడితే ఆ వేలుని నరికేస్తామని గ్రామీణులను హెచ్చరించిన వ్యక్తి ఇప్పుడు ఎన్నిక సిబ్బందిలో ఉంటూ ఆ వేలుకు ఇంకు పూయడం సమూల మార్పుకు నిదర్శనంగా భావించాలి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ప్రభుత్వాల ముందుకు వచ్చిన మావోయిస్టు నేతలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ భవిష్యత్ కార్యక్రమాల గురించి వారిని ప్రశ్నించినపుడు తమ పార్టీపై నిషేధం ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరామని, అదే సాధ్యపడితే చట్టపరిధిలో తమ పార్టీ పని చేసేలా చూస్తామని వారు అంటున్నారు. బుల్లెట్‌పై నమ్మకం పోయినవారు బ్యాలెట్ మార్గాన్ని ఆచరిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత అవసరం. ఎన్నికల్లో పాల్గొంటారా అని ఒకరు అడిగిన ప్రశ్నకు అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓటర్లకు పంచడానికి కోట్లలో ధనం వాడుతున్నారు అని సమాధానం వచ్చింది. సాయుధ పోరాటానికి స్వస్తి పలికామని చెబుతున్న వారు ఎన్నికల బహిష్కరణను కూడా విరమించుకున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.ఎన్నికల విషయంలో అన్ని నక్సలైటు పార్టీలు ఒకే విధానాన్ని పాటించడం లేదు. 1980 నుండి చండ్ర పుల్లారెడ్డి ఎన్నికల్లో పాల్గొంటుంది.
1970 ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణలో తమ విప్లవ కార్యకలాపాలకు నెరిపిన సిపిఐ (మార్క్సిస్టు లెనినిస్టు) పార్టీకి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం వహించేవారు. గ్రామాల్లో వేళ్లూనుకుపోయి ఉన్న వెట్టి చాకిరీ, దొరతనం పోవాలన్నా, అప్పులు ఇచ్చి లేదా బెదిరించి గుంజుకున్న భూములు విముక్తి కావాలన్నా గడీలపై దాడులు తప్పనిసరి. అందుకోసం ఊర్లలో వివిధ సంఘాలను ఏర్పరచి యువకులను సమాయత్తం చేసింది. గ్రామాల్లో నక్సలైట్ ఉద్యమ బహిరంగ కార్యకలాపాలు ఉధృతం అయ్యాక భూస్వామ్య వర్గాలు విప్లవ సంఘాల ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డాయి. వాటిని తిప్పి కొట్టేందుకు వర్గ శత్రు నిర్మూలన అవసరమనే చర్చ పార్టీలో మొదలైంది. అలాంటి సైద్ధాంతిక, ఆచరణాత్మక విభేదాల కారణంగా పార్టీ 1980 ప్రాంతంలో నాయకుల పేరిట వర్గాలుగా చీలిపోయింది. పీపుల్స్ వార్ పేరిట ఏర్పడ్డ చీలిక వర్గానికి కొండపల్లి సీతారామయ్య నాయకుడు. పుల్లారెడ్డి వర్గం ఎన్నికల్లో పోటీ చేయగా కెఎస్ గ్రూపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ అదే మార్గాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందు లొంగిపోతున్న మావోయిస్టులు నాటి కెఎస్ గ్రూపుకు చెందినవారే.
ఎన్నికల్లో పాల్గొన్న సిపి వర్గం పోటీ చేసిన కొన్ని ప్రాంతాల్లో విజయం సాధించడం గొప్ప విషయమే. డబ్బుతో కూడుకున్న ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడం సామాన్యమైనది కాదు. అదే గ్రూపుకు చెందిన ఎన్‌వి కృష్ణయ్య 1989 లో సిరిసిల్లా నియోజకవర్గంనుండి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. సిపిఐ (మా లె) న్యూడెమోక్రసి నుండి ఒకరు ఐదు పర్యాయాలు ఎంఎల్‌ఎగా గెలవడం నక్సలైట్ల చరిత్రలోనే ఓ మైలురాయి. ఆ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లేనందువల్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుమ్మడి నర్సయ్య 1983 నుండి (ఒక టర్మ్ మినహా) 2009 వరకు ఇల్లెందు ఎంఎల్‌ఎగా ఉన్నారు. సైకిలుపై తిరుగుతూ ప్రజలతో కలిసి ఉండే ప్రజాప్రతినిధిగా ఆయనకు ఎంతో పేరుంది. ఈయన జీవిత కథ సినిమాగా వస్తోంది. ఎన్నికలకు డబ్బే సర్వస్వం అయిన ఈ రోజుల్లో ప్రజలతో కలిసి ఉన్నవారు చట్ట సభల్లో అడుగు పెట్టచ్చు అనడానికి వీరే తార్కాణాలు.
సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లు సొంత జీవితం గడుపుతుంటారు. రాజకీయాల్లో చేరాలనుకొనేవారు తక్కువే. అయితే ఇప్పుడు లొంగిపోయినవారు సారథులు. వారి రాకతో పోరుబాటకు తెర పడింది అని చెప్పవచ్చు. వందల్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులే కాకుండా వారి కార్యకలాపాలకు రహస్యంగా సాయపడినవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మైదాన ప్రాంతాల్లో సానుభూతిపరులు ఇంకా పార్టీ వెంటే ఉండవచ్చు. ఇంత నెట్ వర్క్ ఉన్న మావోయిస్టు నేతలు తమ కార్యకలాపాలు లీగల్‌గా కొనసాగించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయనిపిస్తోంది. ప్రజాభిమానం ఉంటే డబ్బు లేకుండానే ఎన్నికల్లో కూడా గెలవవచ్చని తోటి కామ్రేడ్స్ ఇప్పటికే నిరూపించారు. యాభై ఏండ్ల ప్రజాజీవితాన్ని తిరిగి ఆ ప్రజల కోసమే వెచ్చించేందుకు ఎన్నో ద్వారాలు తెరిచి ఉన్నాయి. భారీ బహిరంగ సభలను నిర్వహించిన అనుభవం వారికుంది. తమ సరికొత్త నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వ అనుమతితో ఓ సభ నిర్వహిస్తే ప్రజల స్పందన తెలిసే అవకాశం ఉంది. ఆయుధం వదిలేసినా ప్రజల్లోనే ఉండి, వారి కోసం చట్టపరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తామన్నవారి మధ్య నిర్మాణాత్మకమైన సుదీర్ఘ చర్చలు జరగాలి. ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడే శక్తుల అవసరం ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఉంది.
– బి.నర్సన్, 9440128169