
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 26 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్దమైంది. శనివారం ( ఏప్రిల్ 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలోని 33/11 కెవి విద్యుత్ వైర్లు పడి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో పదిమంది రైతులకు చెందిన సుమారు 26 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్దమైంది.
పెద్ద కోమటిపల్లి గ్రామ శివారులో ఉన్న రైతులకు చెందిన మొక్కజొన్న పంట మీది నుంచి 33/11 కెవి విద్యుత్ వైర్లు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ క్రమంలో మొక్కజొన్న పంటపై వైర్లు పడడంతో రైతులకు చెందిన సుమారు వంద ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపారు రైతులు.
ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట దగ్దమవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు రైతులు.