
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతున్న ‘స్వయంభు’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన నిఖిల్, ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉన్న యాక్షన్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ,’రా రా ధీవర’ సాంగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూ, సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి
మూడు అద్భుత ప్రపంచాల సృష్టి
భారతదేశపు స్వర్ణయుగ నేపథ్యంతో, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా కోసం మేకర్స్ మూడు విభిన్నమైన ప్రపంచాలను సృష్టించారు. హైదరాబాద్‌లోని జన్వాడలో సుమారు 8 ఎకరాల్లో 45 రోజుల పాటు శ్రమించి ఒక పూర్తి స్థాయి గ్రామం సెట్‌ను నిర్మించినట్లు దర్శకుడు వివరించారు. మొదటి సెట్‌నే సరికొత్తగా తీర్చిదిద్ది, కథానాయికకు సంబంధించిన సన్నివేశాల కోసం వైవిధ్యంగా మార్చారు. ఇక సినిమాకే హైలైట్‌గా నిలిచే క్లైమాక్స్ కోసం 80 రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్లు వేశారు. 100 అడుగుల పొడవైన వంతెన, భారీ పర్వత ప్రాంతం వంటివి బ్లూ మ్యాట్ టెక్నాలజీతో అద్భుతంగా రూపొందించి చిత్రీకరించినట్లు తెలిపారు..
భారీ అంచనాలతో..
ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్ల జాబితా చూస్తేనే సినిమా స్థాయి అర్థమవుతుంది. ‘బాహుబలి’, ‘RRR’ వంటి విజువల్ వండర్స్‌కు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘KGF’, ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. వీరిద్దరి కలయిక సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రీ బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
వారసత్వం – పరాక్రమం
ఈ చిత్రంలో నిఖిల్ మునుపెన్నడూ లేని విధంగా శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన ‘సెంగోల్’ (రాజదండం) ఈ కథలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ధైర్యం, వారసత్వం, , దేశభక్తి కలగలిసిన ఈ ట్రావెల్-యాక్షన్ అడ్వెంచర్ ఈ ఏడాది మే చివర వారం, లేదా జూన్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ‘స్వయంభూ’ సిద్ధమవుతోంది. నిఖిల్ మేకోవర్ యాక్షన్ , సీక్వెన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.