Reading Time: 2 minutes

అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. గేమింగ్ యాప్ ద్వారా ట్రాప్.. నిందితుడు అరెస్ట్!

Caption of Image.

నేటి డిటిజల్ యుగంలో ముప్పు ఎటు నుంచి వస్తుందో ఊహించడం కష్టంగా మారింది. సామాన్యులే కాదు.. సెలబ్రిటీల పిల్లలు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 13 ఏళ్ల కుమార్తెను ఆన్ లైన్ గేమింగ్ ప్లామ్ ఫారమ్ ద్వారా వేధించిన కామాంధుడిని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ వార్త ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?

గత ఏడాది అక్టోబర్‌లో ముంబై పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ వేడుకల్లో అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన కుమార్తె ఒక ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు, ఒక గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్‌ల ద్వారా పరిచయమయ్యాడు. మొదట చాలా బాగా ఆడావు, నువ్వు ఎక్కడి నుంచి? అంటూ అత్యంత మర్యాదగా సంభాషణ మొదలుపెట్టాడు. ఆ మాటలకు ఆ చిన్నారి అతడు మంచివాడే అనుకుంది.

కాసేపటి తర్వాత నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా? అని అడిగాడు. ఆమె అమ్మాయిని అని చెప్పగానే, ఆ వ్యక్తి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఆమె న్యూడ్ ఫోటోలు పంపమని వేధించడం మొదలుపెట్టాడు. అయితే, ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా వెంటనే గేమ్‌ను ఆపేసి, జరిగిన విషయాన్ని తన తల్లి ట్వింకిల్ ఖన్నాకు వివరించింది. ఈ అప్రమత్తతే ఆమెను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది.

నిందితుడి అరెస్ట్..

అక్షయ్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర సైబర్ సెల్ అధికారులు, అత్యాధునిక టెక్నాలజీ సాయంతో నిందితుడి డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను ట్రాక్ చేశారు. చివరకు నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇతడు కేవలం అక్షయ్ కుమార్ కుమార్తెనే కాకుండా.. మరికొంతమంది మైనర్ బాలికలను కూడా ఇదే విధంగా ట్రాప్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పాఠశాలల్లో సైబర్ పాఠాలు

ఈ ఘటనపై స్పందిస్తూ అక్షయ్ కుమార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక కీలక విన్నపం చేశారు. వీధి నేరాల కంటే సైబర్ నేరాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. పాఠశాలల్లో ప్రతి వారం సైబర్ అవగాహన తరగతులు నిర్వహించాలి అని కోరారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్ ఎటాక్స్, సైబర్ బుల్లింగ్ వంటి అంశాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

తల్లిదండ్రులూ జాగ్రత్త!

పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ఆడుతున్నారు అనేది గమనించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా ఇంట్లో చెప్పేలా పిల్లలతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ప్రపంచంలో అప్రమత్తతే అసలైన రక్షణ అని పేర్కొంటున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.