Reading Time: 2 minutes

పీవీ సింధు నుదుటిపై స్మార్ట్ డివైజ్.. ఈ కొత్త హెల్త్ ట్రాకర్‌ ఏంటి ? ఎలా పనిచేస్తుంది ?

Caption of Image.

డెన్మార్క్‌లోని హోర్సెన్స్ నగరంలో జరిగిన థామస్ అండ్ ఉబెర్ కప్ మ్యాచ్‌ల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం ఆమె ఆట తీరుతోనే కాకుండా, ఆమె నుదుటిపై ఉన్న ఒక వింత పరికరం టెంపుల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఏమిటా టెంపుల్ పరికరం
ఇది జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అభివృద్ధి చేసిన ఒక అత్యాధునిక వేరబుల్ అంటే ధరించగలిగే పరికరం. ఇది నుదుటి భాగంలో రక్త ప్రసరణను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. దీని  ప్రయోజనం ఏంటంటే ఆటగాడి ఏకాగ్రత, శారీరక స్థితి, మెదడు ప్రతిస్పందనలను ఇది డేటా రూపంలో అందిస్తుంది.

దీని  ప్రత్యేకత చూస్తే  ఇది సుమారు 1 అంగుళం పొడవు ఉంటుంది. దీనికి బ్లూటూత్ అవసరం లేదు. ఒక్కసారి ధరిస్తే 3 నుండి 4 గంటల పాటు పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం టెస్టింగ్ దశలోనే ఉంది, మార్కెట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు.

మ్యాచ్‌లో సింధు అద్భుత ప్రదర్శన
ఉబెర్ కప్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫర్సన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 21-13, 18-21, 21-17  స్కోరుతో పి.వి. సింధు విజయం సాధించారు. చివరి సెట్‌లో 12-15తో వెనుకబడినప్పటికీ, పట్టుదలతో ఆడి గెలవడం విశేషం. ఆ సమయంలోనే ఆమె ఈ కొత్త పరికరాన్ని ధరించి కనిపించారు.

భర్త సపోర్ట్ 
పీవీ సింధు భర్త, టాటా మైనింగ్ కంపెనీ (పోసిడెక్స్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వెంకట దత్త సాయి, ఈ టెక్నాలజీ విషయంలో ఆమెకు పూర్తి అండగా నిలుస్తున్నారు. ఈ పరికరం ద్వారా ఆమె ఆరోగ్య సూచికలను పర్యవేక్షిస్తున్నాము. దీని ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వరకు సింధు ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడమే మా లక్ష్యం అని ఆయన తెలిపారు.

సింధు కూడా తన భర్త గురించి మాట్లాడుతూ, ఆయనకు బ్యాడ్మింటన్ సాంకేతికతలు తెలియకపోయినా, టెక్నాలజీ పరంగా తన ఆటను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

 రెండు గంటల వ్యవధిలోనే సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లు ఆడి గెలిచిన సింధు, సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నాకు ఇప్పుడు 19 ఏళ్లు కావని నా శరీరం గుర్తు చేస్తోంది. కానీ దేశం కోసం ఈ రెండు మ్యాచ్‌లు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది  అని అన్నారు. 

సింధుపై చేస్తున్న ఈ ‘టెంపుల్’ పరికరం ప్రయోగం సక్సెస్ అయితే, భవిష్యత్తులో క్రీడా ప్రపంచంలో ఇదొక పెద్ద విప్లవం కానుంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ ఎంతలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

©️ VIL Media Pvt Ltd.