Reading Time: 2 minutes

ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఛేజ్.. ఢిల్లీపై పంజాబ్ సూపర్బ్ విక్టరీ.. 

Caption of Image.

DC vs PBKS: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 అద్భుత పోరులో పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అభిమానులను ఉర్రూతలూగించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య ఆరంభం నుండే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం మొదటి 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు రాబట్టి, ఈ సీజన్‌లోనే అత్యధిక పవర్‌ప్లే స్కోరును నమోదు చేశారు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ప్రభ్‌సిమ్రన్, ముఖేష్ కుమార్ వేసిన ఓవర్లో 6 ఫోర్లు (4,4,4,4,4,4) బాది 24 పరుగులు రాబట్టడం హైలైట్‌గా నిలిచింది.

వరుస వికెట్లు పడినా.. తగ్గని జోరు: 
ఓపెనర్ల మధ్య నెలకొన్న 126 పరుగుల భాగస్వామ్యానికి అక్షర్ పటేల్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ప్రియాంష్ ఆర్య (17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 43 పరుగులు) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ప్రభ్‌సిమ్రన్ ( 26 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 76 పరుగులు), కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన కూపర్ కొన్నోలీ (10), ఇంపాక్ట్ ప్లేయర్ నెహల్ వధేరా (25) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఫినిష్: 
ఒకవైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 71 పరుగులతో నాటౌట్) ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేశాడు. తన మార్క్ హిట్టింగ్‌తో ఢిల్లీ బౌలర్లను కోలుకోనీయకుండా చేసి, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ అద్భుత విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ ఛేజ్‌గా ఈ మ్యాచ్ నిలిచిపోతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్, విఫ్రజ్ నిగమ్ తలో వికెట్ పడగొట్టారు.  

©️ VIL Media Pvt Ltd.