Reading Time: 2 minutes

షాకింగ్ ఘటన.. ఈ కానిస్టేబుల్ లవర్ ఎంత పనిచేసిందో చూడండి..!

Caption of Image.

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్పూర్లో దారుణం జరిగింది. పెళ్లై పిల్లలు ఉన్న ఒక కానిస్టేబుల్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కానిస్టేబుల్కు, అతనితో సంబంధం కొనసాగిస్తున్న మహిళకు మధ్య తలెత్తిన గొడవ కానిస్టేబుల్ కుటుంబానికి ముప్పు తెచ్చిపెట్టింది. ఆ కానిస్టేబుల్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన సదరు మహిళ అతని భార్యా, ముగ్గురు పిల్లలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ దాడిలో కానిస్టేబుల్ భార్య, కొడుకు తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో సదరు కానిస్టేబుల్ ఇంట్లో లేడు. రైల్వే స్టేషన్కు టికెట్లు కొనేందుకు వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఉదయం.. నిందితురాలు సరోజినీ భరద్వాజ్ దుర్గ్‌లోని కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ఫ్లాట్‌కు వెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

సరోజినీ కానిస్టేబుల్ భార్య రీనా యాదవ్‌తో గొడవ పడింది. ఆ తర్వాత ఆ గొడవ బయటకు వినపడకుండా ఉండేందుకు ఆమె టీవీ సౌండ్ పెంచింది. ఆ తర్వాత దాడి చేసే ఉద్దేశంతో కత్తి తీసుకుంది. రీనాపై దాడి చేసి, ఆపై ఆమె ముగ్గురు పిల్లలపై దాడికి యత్నించింది. నిందితురాలు మొదట నిద్రపోతున్న తొమ్మిదేళ్ల ఆదిత్యను పదేపదే కత్తితో పొడిచింది. ఈ దాడిలో పిల్లాడు తీవ్రంగా గాయపడ్డాడు. కానిస్టేబుల్ కూతుర్లు.. నైనా, తానియాలపై సరోజినీ దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్ తన పిల్లలను వదిలిపెట్టమని నిందితురాలిని వేడుకుంది. నిందితురాలి కాళ్లను పట్టుకుని.. పారిపోవాలని తన ఇద్దరు కూతుర్లకు చెప్పింది.

ఒక కూతురు బాత్రూంలో దాక్కోగా, మరొక కూతురు ఇంటి నుంచి తప్పించుకుని ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. ఇరుగుపొరుగు వాళ్లు హుటాహుటిన రీనా యాదవ్ ఇంటికి వెళ్లి చూడగా.. సరోజినీ రక్తం కారుతున్న కత్తి చేతిలో పట్టుకుని నిలబడింది. ఆమె చేతిలో నుంచి కత్తిని లాక్కుని సరోజినినీ పోలీసులకు అప్పగించారు. రీనా యాదవ్, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె, ఆమె కొడుకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇద్దరు కూతుర్లు చికిత్స పొందుతుండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సరోజినీ భరద్వాజ్, లలితేష్ యాదవ్‌ల మధ్య వివాహేతర సంబంధం నడుస్తుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సరోజినీ భరద్వాజ్ శుక్రవారం కూడా అతని ఇంటికి వెళ్లగా.. నచ్చజెప్పి ఆమెను పంపించేశాడు. కానీ.. శనివారం అతను ఇంట్లో లేని సమయంలో సరోజినీ ఈ దారుణానికి పాల్పడింది. హత్యా, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు భిలాయ్ సీఎస్పీ సత్యప్రకాష్ తివారీ తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేశామని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.