
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్లు శివాలెత్తారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి సరికొత్త రికార్డులను సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌గా నిలిచిపోనుంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావటం విశేషం.
రాహుల్ వీరవిహారం – రికార్డుల మోత
ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి 152 పరుగులు (నాటౌట్) చేసి.. ఐపీఎల్ 2026లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ (141) పేరుపై ఉండేది. రాహుల్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.
రాహుల్‌కు తోడుగా నితీష్ రాణా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 220 భారీ భాగస్వామ్యం నమోదైంది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మారింది. టేబుల్ టాపర్స్ అయినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి వారి వద్ద సమాధానం లేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిలో ఒక వికెట్ కూడా ఉంది. బార్ట్ లెట్ 4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 265 పరుగులు చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఎలా ఛేదిస్తుందో చూడాలి!