
KL Rahul Nitish Rana Partnership Record: ఢిల్లీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నిశ్శంక కేవలం 11 పరుగులకే వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. పవర్‌ప్లేలో 68 పరుగులు చేసిన ఈ జోడీ, ఆ తర్వాత కేవలం 9 ఓవర్లలోనే 189 పరుగులు పిండుకోవడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ స్కోర్..
ఈ విధ్వంసం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ జట్టు అత్యంత వేగంగా (15.3 ఓవర్లలోనే) 200 పరుగుల మార్కును అందుకుంది. గతంలో ముంబైపై 16.1 ఓవర్లలో చేసిన రికార్డును ఈ మ్యాచ్‌తో తిరగరాశారు. అంతేకాకుండా, పంజాబ్ కింగ్స్‌పై రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (140 పరుగులు) నెలకొల్పిన జోడీగా కూడా వీరు నిలిచారు.
పంజాబ్ బౌలర్ల బజాయంపు..
ఢిల్లీ బ్యాటర్ల దాటికి పంజాబ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా జేవియర్ బార్ట్లెట్ వేసిన ఒక ఓవర్లో నితీష్ రాణా 2 సిక్సర్లు, 4 ఫోర్లతో విరుచుకుపడటంతో ఆయన ఎకానమీ రేటు ఏకంగా 17.25కు చేరుకుంది. స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 49 పరుగులు సమర్పించుకోగా, మార్కో జాన్సెన్ (45 పరుగులు), వైశాఖ్ (48 పరుగులు), యుజ్వేంద్ర చాహల్ (42 పరుగులు) భారీగా పరుగులు ఇచ్చారు.
ఐపీఎల్ 2026లో టాప్ స్కోరు..
కేఎల్ రాహుల్, నితీష్ రాణా ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోర్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. పంజాబ్ చేసిన 254 పరుగులు, బెంగళూరు చేసిన 250 పరుగుల రికార్డులను అధిగమించి ఢిల్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..