Reading Time: 3 minutes

ఆరు రుచులతో ఉగాది పండగను చేసుకున్న మరునాడే తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది కొత్త పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రజలను ఆకట్టుకుంటోంది. రూ. 3.24 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సమర్పించిన ఈ బడ్జెట్‌లో 1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం 2. చేయూత 3. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 4. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం 5. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం 6. నగదు రహిత ఆరోగ్యభద్రత 7. ఉద్యోగుల ప్రమాద బీమా 8. సిఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం 9. ఎటిసి ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకాలు చోటు చేసుకున్నాయి. సంక్షేమం, నీటిపారుదల, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడమైంది. అభివృద్ధికి, హామీలకు మధ్య సమతుల్యత పాటించారు. తెలంగాణ నగరపాలక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఆ ఎన్నికల్లో ప్రత్యర్థుల నుంచి పోటీ గట్టిగా ఎదుర్కొనేలా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండేలా ప్రవేశపెట్టిన ఈ మూడో వార్షిక బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వానికి ఒక సవాలు వంటిదే. గత ఏడాది 202526 బడ్జెట్ రూ.3.04 లక్షల కోట్లతో సమర్పించగా, ఈ ఏడాది రూ. 3.24 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సమర్పించడమైంది. అంటే ఈసారి దాదాపు రూ. 20 లక్షల కోట్లు అధికంగా కేటాయించడమైందని చెప్పాలి.

ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ. 2,34,406 కోట్లుగా ప్రతిపాదించగా, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లుగా పేర్కొనడమైంది. మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రెండో దశ విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులకు ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెటేతర మార్గాలద్వారా నిధులు సమకూరుస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోఉండే సంస్థలు, ప్రత్యేక బాండ్లు లేదా ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తారు. వ్యయాలను నియంత్రిస్తూ ఆదాయ వసూళ్లను పెంచడంపై దృష్టి సారించారు. ప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశం మొత్తం మీద మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుందని నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. అమృత్, నగరాల మౌలిక సదుపాయాల విస్తరణకు ఉద్దేశించిన స్మార్ట్ సిటీస్, పిఎం గతిశక్తి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని నిధులు సమకూర్చుకోవాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.

జాతీయ అభివృద్ధి రేటు 202425 లో 9.8% నుంచి 202526 లో 8 శాతానికి దిగజారగా, తెలంగాణలో 202425లో 10.6% నుంచి 202526లో 10.7 శాతానికి పెరగడం విశేషం. అలాగే జాతీయ తలసరి ఆదాయం 6.9 శాతంతో రూ.2,19,575 వరకు నిలిచిపోగా, తెలంగాణలో తలసరి ఆదాయం 2025 26 లో 10.2% వృద్ధిరేటుతో రూ. 4,18,931 వరకు ఉండడం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లు వరకు పెంపొందేలా ప్రయత్నించాలని లక్షం పెట్టుకున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ లక్షాన్ని సాధించడానికి వివిధ రకాల ప్రత్యేక రంగాలవారీ ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధపడుతోంది. అనేక సవాళ్లు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ బూడిద నుంచి ఫీనిక్స్ పక్షి తిరిగి ప్రాణం పోసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పథంవైపు దూసుకెళ్తోందని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది.

రైతు సంక్షేమం, మహళా సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్య భద్రత, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో హద్దూపద్దూ లేకుండా విపరీతంగా రుణాలు తీసుకొచ్చారు. దాంతో రాష్ట్రఖజానాపై అపరిమిత ఆర్థిక భారం పడింది. అత్యధిక వడ్డీరేట్లతో గత ప్రభుత్వం రూ. 25,612 కోట్ల వరకు రుణాలు చేసింది. దీంతో ఈ రుణ ఒప్పందాలను తిరిగి తక్కువ వడ్డీ రేట్లకు సవరించుకునేలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. అంతేకాక రుణాలు తిరిగి చెల్లించే గడువు పొడిగించుకోవలసి వచ్చింది. రుణాల అసలు మొత్తం చెల్లింపుల గడువు 20ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచుకోక తప్పలేదు. రుణ పునర్వవస్థీకరణతో రుణాలు తిరిగి చెల్లించే గడువు 202526 నుంచి 203132 లోగా చెల్లించవలసిన రుణ భారం రూ. 34,058 కోట్ల నుంచి రూ. 11,915 కోట్లకు తగ్గింది. ఫలితంగా జీతాల చెల్లింపు, ఇతర వ్యవహారాలకు చెల్లించవలసిన నగదు లావాదేవీలు రూ. 22,142 కోట్ల వరకు తగ్గింది.

దాంతో నగదు కొరత కొంతవరకు తగ్గి వ్యవహారాలు సజావుగా సాగేలా ఊరట లభించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ. 3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లించామని, తాము తెచ్చిన అప్పుల్లో కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే వినియోగించుకున్నామని వెల్లడించడం గమనార్హం. జాతీయ జిడిపి కంటే తెలంగాణ జిఎస్‌డిపి మెరుగ్గా ఉందని, జిఎస్‌టి వసూళ్లు గడిచిన రెండు నెలల్లో రూ. 4 వేల కోట్లు దాటాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈసారి సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతోపాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సేకరణ మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ప్రభుత్వం ముందున్నాయి. అలాగే రుణాలు విపరీతంగా చేయడం కన్నా ఆర్థిక వనరుల సమీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను ఆలోచిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ద్వారా రూ. 3 వేల కోట్ల వరకు అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది.