Reading Time: 2 minutes
Chanakya Niti Tips To Deal With Jealous Relatives And Toxic People

Chanakya Niti: భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉన్న కాలంలో, అఖండ భారతాన్ని కలగన్న ఏకైక వ్యక్తి ఆచార్య చాణక్య. ఆయన కేవలం ఒక గురువు మాత్రమే కాదు.. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన శిల్పి. నంద వంశాన్ని అంతం చేస్తానని శపథం పూని, చంద్రగుప్త మౌర్యుడిని సింహాసనంపై కూర్చోబెట్టిన ధీశాలి. ఆయన రాసిన చాణక్యనీతి గ్రంథం నాటి నుంచి నేటి వరకు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. బంధువులు అంటే ప్రేమను పంచేవారు మాత్రమే కాదని.. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా మన చుట్టూనే ఉంటారని చెప్పారు ఆచార్య చాణక్య. “నువ్వు ఎలా ఉన్నావు?” అని వారు అడిగేది మీ మీద ప్రేమతో కాదు.. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పారు. మీ సంపాదన, ఇంటి గొడవలు, వ్యక్తిగత విషయాలనే సమాచారంగా సేకరించి, సమయం చూసి మీపైనే వాటిని ప్రయోగిస్తారు. ఇలాంటి ‘గూఢచారి’ బంధువుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలలో ఆచార్య చాణక్య వేల ఏళ్ల క్రితమే చెప్పారు. అది ఎలాగో ఈస్టోరీలో తెలుసుకుందాం.

ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే కోపంతో రియాక్ట్ అవ్వడం అతిపెద్ద తప్పు. కోపాన్ని అణచుకోగలిగిన వాడే అసలైన వీరుడని చాణక్యుడు అంటారు. ఎవరైనా “నీవల్ల ఏమీ కాదు” అన్నప్పుడు.. చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోండి. మీ మౌనం చూసి వారికి పిచ్చెక్కుతుంది. ఎందుకంటే వారి మాటకు మీరు అస్సలు బాధపడలేదని అర్థమైనప్పుడు.. అది వారి ఓటమి అవుతుంది. మీ పతనానికి మీ వ్యక్తిగత సమాచారమే ముడిసరుకు. ఎవరైనా వచ్చి “నీ జీతం ఎంత? ఎంత సంపాదిస్తున్నావు?” అని అడిగితే.. అంకెలు చెప్పకండి. “భగవంతుడి దయ వల్ల అన్నీ బాగానే జరుగుతున్నాయి, అంతా నడుస్తోంది” అని సింపుల్‌గా సమాధానం ఇచ్చి టాపిక్ మార్చేయండి.

“నువ్వు ఈ పని చేయలేవు” అని ఎవరైనా అంటే వారితో గొడవ పడకండి. “అవును, బహుశా మీరు చెప్పింది నిజమే కావచ్చు” అని చెప్పండి. గొడవ పడాలని వచ్చిన శత్రువు మీరు అలా అనగానే నీరసపడిపోతాడు. పోరాడకుండానే శత్రువును ఓడించే గొప్ప వ్యూహం ఇది. మీ శాంతిని బలహీనత అనుకునే వారికి “అతి వినయం”తో బుద్ధి చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని కించపరిస్తే.. “నా కళ్లు తెరిపించారు.. మీలాంటి మార్గదర్శి దొరకడం నా అదృష్టం” అని గౌరవంగా చెప్పండి. మీ మాటల వెనుక ఉన్న అసలు అర్థం వారికి అర్థమైనా.. పైకి మాత్రం నోరు మూయక తప్పదు. మీ లక్ష్యాలను పని పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. ప్రపంచానికి దూరంగా ఉండి కష్టపడండి. మీ విజయం ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు.. అది అందరి నోళ్లు మూయిస్తుంది. శత్రువులకు ఇచ్చే అతిపెద్ద సమాధానం మీ “సక్సెస్” మాత్రమే. ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండకండి. “అతిగా కలిసిన చోట గౌరవం తగ్గుతుంది” అన్నది చాణక్య సూత్రం. ప్రతి ఫోన్ కాల్ వెంటనే ఎత్తకండి, ప్రతి వేడుకకు వెళ్లకండి. మీరు కొంచెం అరుదుగా కనిపిస్తే.. మీ విలువ, గౌరవం ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. బంధువుల ఈర్ష్యను మీ మెదడుపైకి ఎక్కించుకోవద్దు. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మాటలతో కాకుండా మీ కృషితో వారికి సమాధానం ఇవ్వండి.