Reading Time: < 1 minute
Russia Sarmat Missile Test Putin 35000km Range Nuclear Threat

Russia: ప్రపంచానికి రష్యా సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ క్షిపణి శక్తి సమతుల్యత ఉలిక్కిపడే ఒక ప్రకటన చేశారు. మాస్కో ఇటీవల అణు సామర్థ్యం గల కొత్త ‘సర్మాట్’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిని యుద్ధ విధుల్లో మోహరించాలని రష్యా యోచిస్తోందని వెల్లడించారు. ఈ క్షిపణి పరిధి 35,000 కిలోమీటర్లకు పైగా ఉండవచ్చని పుతిన్ అంటున్నారు. ఇదే జరిగితే, ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యధిక పరిధి గల క్షిపణిగా నిలుస్తుంది. అయితే దీని ప్రస్తుత పరిధి 18,000 కిలోమీటర్లుగా ఉందని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక పరిధి అని పలు నివేదికలు చెబుతున్నాయి.

సర్మాట్ క్షిపణి ఎందుకు ప్రత్యేకమైనదంటే..
సర్మాట్ క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం అయిన తర్వాత, పొసైడాన్ – బురెస్ట్నిక్ వ్యవస్థలపై పనులు తుది దశలో ఉన్నాయని వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఒరేశ్నిక్‌కు అణ్వాయుధాలను అమర్చే అవకాశం ఉందని అధ్యక్షుడు చెప్పారు. ఏబీఎం ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, రష్యా తన వ్యూహాత్మక భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సర్మాట్ విజయవంతంగా ప్రయోగించిన తర్వాత, ఈ సంవత్సరం చివరి నాటికి దాని మొదటి రెజిమెంట్‌ను మోహరిస్తారని వ్యూహాత్మక క్షిపణి దళాల కమాండర్ కారకాయెవ్ పేర్కొన్నారు. సార్మాట్ వ్యవస్థ దాని గతంలోని వోయెవోడా క్షిపణి వ్యవస్థ కంటే విధ్వంసక శక్తి, ప్రయోగించే బరువు, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించే సామర్థ్యం వంటి అనేక కీలక అంశాలలో శ్రేష్ఠమైనదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సర్మాట్ క్షిపణిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అతిశయోక్తి వాదనలు చేశారని పాశ్చాత్య భద్రతా విశ్లేషకులు అంటున్నారు. గతంలో సర్మాట్ వైఫల్యాలను చవిచూసిందని చెబుతున్నారు.