Reading Time: < 1 minute
Andhra Pradesh Sees Record Power Consumption As War Impact Boosts Electricity Demand

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగంపై కూడా పడుతోంది. వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తూ.. చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మార్చి 7న రికార్డు స్థాయిలో 274.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 9.15 శాతం అధికంగా ఉంది. మార్చి 12, 13, 14 తేదీల్లో వరుసగా సుమారు 272 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది.

Also Read: Punganur Tragedy: ఒక చిన్న నిర్లక్ష్యం.. నాలుగు ప్రాణాలు బలి!

అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాటు యుద్ధ ప్రభావం కూడా విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వేసవి కాలంలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 256 మిలియన్ యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది మే నాటికి అది 280 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. అయితే మార్చి నెల సగం పూర్తికాకముందే వినియోగం 274 మిలియన్ యూనిట్లను దాటడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మే నాటికి విద్యుత్ వినియోగం 300 మిలియన్ యూనిట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని అధికారులు చెబుతున్నారు.