
అఫ్గాన్ తాలిబన్లపై పాక్‌సైన్యాల దాడులు కొనసాగుతున్నాయి. పాక్ భద్రతా దళాలు ఆయుధ డిపోను ధ్వంసం చేశాయని ప్రభుత్వ మీడియా సోమవారం వెల్లడించింది. పాక్, అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని 2600 కిమీ పొడవునా 53 ప్రాంతాల్లో తాలిబన్ దళాలు దాడి చేసిన తరువాత పాకిస్థాన్ ఆపరేషన్ ఘజాజ్ లిల్ హక్‌ను గత వారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 415 మంది అఫ్గాన్ తాలిబన్లను పాకిస్థాన్ దళాలు హతమార్చాయని, మరో 580 మంది గాయపడ్డారని పాక్ సమాచార మంత్రి అత్తయుల్లా తరార్ ఆదివారం వెల్లడించారు. ఖోస్ట్ లోని ఫిట్నా అల్ ఖవర్జ్ అనే తాలిబన్ ఆయుధ డిపోను సమర్ధంగా పాక్ దళాలు ధ్వంసం చేయగలిగాయని చెప్పారు. పాకిస్థాన్ దళాలు బగ్రాం విమాన స్థావరం వరకు తమ వైమానిక దాడులను విస్తరించాయని అఫ్గాన్ వర్గాలు పేర్కొన్నాయి.