
హోలీ పండుగను ప్రజలంతా ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రసాయనిక రంగులను వినియోగించకుండా, పూలు, ఔషధ మొక్కలు, ప్రకృతి వనరులతో తయారైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. పర్యావరణానికి, మనుషులకు హాని కలిగించే రసాయనిక రంగులను అస్సలు వాడకూడదని కోరారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని, పండుగలను కూడా పర్యావరణహితంగా జరుపుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని కోరారు. హోలీని ప్రేమ, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మలుచుకోవాలని తెలిపారు.