Reading Time: < 1 minute
Tollywood Natti Kumar Resigns Joint Secretary Telugu Film Producer Council

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. మే 13, 2026 తేదీతో కూడిన తన రాజీనామా లేఖను కౌన్సిల్ అధ్యక్షుడు, సెక్రటరీ సహా ఇతర కార్యవర్గ సభ్యులకు ఆయన పంపించారు. కౌన్సిల్ ప్రస్తుత పనితీరుపై తీవ్ర నిరాశతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నట్టి కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. పర్సంటేజీ వ్యవస్థను సరిగ్గా నిర్వహించడంలో మండలి విఫలమైందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆఫీస్ బేరర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ గిల్డ్ కార్యకలాపాలు నడుపుతున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల ఎగ్జిబిటర్ల ఆధిపత్యం పెరిగిపోతోందని, ఫలితంగా చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతూ పతనమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కౌన్సిల్‌లో కనీస ప్రజాస్వామ్య విధానాలు అమలు కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆఫీస్ బేరర్ల ప్రమేయం లేకుండా, సరైన సమాచారం ఇవ్వకుండానే సమావేశాలు నిర్వహిస్తున్నారని, సరైన ఎన్నికల ప్రక్రియ లేకుండానే సంస్థను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆడిటింగ్, సహా ఆర్థిక నిర్వహణలో ఎలాంటి పారదర్శకత, జవాబుదారీతనం లేదని ఆయన తన లేఖలో కుండబద్దలు కొట్టారు. సభ్యులకు పారదర్శకంగా సేవ చేయలేని, ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేని బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన తేల్చి చెప్పారు. తన రాజీనామా తర్వాత అయినా సంస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు తన లేఖ ద్వారా కౌన్సిల్‌కు పలు సూచనలు చేశారు. తన రాజీనామా తర్వాత అయినా ఆఫీస్ బేరర్లంతా చురుకుగా వ్యవహరించి, నిర్మాతలందరి సంక్షేమం కోసం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో సంస్థను పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నడపడానికి వీలుగా వెంటనే సరైన ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన అకౌంటెంట్లు, ఆడిటర్లను నియమించి, అకౌంట్స్ నిర్వహణను పారదర్శకంగా ఉంచాలని కోరారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన రాజీనామాను ఆమోదించాలని కౌన్సిల్‌ను అభ్యర్థించారు.