Reading Time: < 1 minute
Rcb Vs Kkr Ipl 2026 Shane Watsons Big Virat Kohli Comment Ahead Of Crucial Clash

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండు డకౌట్లు నమోదు చేసి ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగే కీలక మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ కింగ్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఆర్సీబీ, కేకేఆర్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన షేన్ వాట్సన్.. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విరాట్ కోహ్లీ ఆడిన షాట్‌ గురించి ప్రస్తావించాడు. ‘గత మ్యాచ్‌లో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా షాట్ ఆడాలని మేము ఆశిస్తున్నాం’ అని వాట్సన్ సరదాగా వ్యాఖ్యానించాడు. ముంబైపై కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ లాంటి సీనియర్ బ్యాటర్ తప్పిదాల నుంచి త్వరగా నేర్చుకుంటాడని వాట్సన్ పేర్కొన్నాడు. ‘ప్రతి టీమ్ కోహ్లీ కోసం ప్రత్యేక ప్రణాళికలతోనే బరిలోకి దిగుతుంది. అతడి బలహీనత ఎక్కడ ఉందో గుర్తించి దానికి తగ్గట్టు బౌలింగ్ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ కింగ్ కోహ్లీకి వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు’ అని వాట్సన్ తెలిపాడు.

విరాట్ కోహ్లీని మొదటి బంతి నుంచే ఒత్తిడిలో పడేయాలని కేకేఆర్ భావిస్తున్నట్లు షేన్ వాట్సన్ వెల్లడించాడు. ‘విరాట్‌ను బుట్టలో వేయాలంటే మొదటి బంతి నుంచే కచ్చితమైన ప్రణాళికతో ఉండాలి. లేకపోతే అతడు జట్టుకు అద్భుతమైన ఆరంభం అందిస్తాడు. కోహ్లీ ఎన్నో ఏళ్లుగా అదే చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో కోహ్లీ అరుదుగా చేసే తప్పిదం మాకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం’ అని అన్నాడు. ఇక ఐపీఎల్ 2026లో కేకేఆర్ అద్భుత కంబ్యాక్ ఇచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన కోల్‌కతా.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. బుధవారం ఆర్సీబీపై విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును మరింత పటిష్టం చేసుకోనుంది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ నంబర్-1 స్థానాన్ని దక్కించుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.