
హైదరాబాద్: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, విధానాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రక్తం చిందించకుండా దేశం గెలవొచ్చని మన జాతిపిత మహాత్మ గాంధీ ప్రపంచానికి చాటారని అన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి సిఎం,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పథంలో నడవొచ్చని చెప్పిన మేధావి అంబేద్కరని కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని, దేశానికి గాంధీ అంబేద్కర్ రెండు కళ్లు అని ప్రశంసించారు.
తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి అనేది ఆలోచన చేయండని, దళిత, గిరిజనులకు ఇచ్చిన ప్రాధాన్యత చూడండని, కేబినెట్ లో దళితుతకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో పోల్చండని రేవంత్ సూచించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే.. అవమానకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దళిత బిడ్డ ఆర్థిక మంత్రి గానో, స్పీకర్ గానో ఉండొద్దా? అని ప్రశ్నించారు. దళిత బిడ్డను అధ్యక్షా అని మైక్ అడగాల్సి వస్తుందని కొందరు సభకు రావడం లేదని, ఓయూకి విసిగా ఇప్పటి వరకు దళితుడికి అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా వచ్చిందని పదేళ్ల పాలన.. రెండేళ్ల పాలనను బేరీజు వేసుకోండని, ఓర్వ లేక తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజన, బిసిలకు ఇందిరమ్మ ఇళ్లు అందడం లేదా? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.