
రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుండి సమ్మె చేస్తున్నట్టు టిజిఎస్ ఆర్‌టిసి జెఎసి ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె అనివార్యమయ్యిందని వెల్లడించింది. మార్చి 13న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి కాని, యాజమాన్యం నుండి కాని ఎలాంటి స్పందన లేదని తెలిపింది. యాజమాన్యం, ప్రభుత్వం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లు తెలిపారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి మౌలనా డిమాండ్ చేశారు. ఏప్రిల్ 22న మొదటి డ్యూటీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు జెఎసి నేతలు వెల్లడించారు. ఈ జెఎసి వెనుక 40 వేల మంది కార్మికుల బలం ఉందని చెప్పారు. కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని, విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.
తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కమిటీ వేశామంటూ కాలయాపన చేయొద్దని, ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. కొత్త కోర్కెలేవీ కోరడం లేదన్నారు. ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బంది పెట్టే బదిలీలు ఆపి, ఎక్కడి వారిని అక్కడే ఉంచాలన్నారు. సోమవారం కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి కార్మిక సంఘాలు, పాల్గొనగా వరుసగా రెండో సారి ఆర్‌టిసి యాజమాన్యం హాజరు కాకపోవడంతో ఎలాంటి చర్చలు జరగలేదు. దీంతో జెఎసి నేతలు ఈ నెల 22 నుండి సమ్మెకు వెళుతున్నట్లు జెఎసి నేతలు ఈదురు వెంకన్న, ధామస్ రెడ్డి, ఎండి మౌలానా పిలుపునిచ్చారు.