Reading Time: < 1 minute

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ, సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్‌చార్జిలను కేటీఆర్ ఖరారు చేశారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల నియోజకవర్గానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,

ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్. రవీందర్ రావు, వేములవాడ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలను నియమించారు. సభకు వచ్చే జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.