Reading Time: < 1 minute

ప్రముఖ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టిసిఎస్)లో లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్ క్యాంపస్‌లో జరిగిన ఈ వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులపై సంస్థ వేటు వేసింది. మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. అరెస్టయిన ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు టిసిఎస్ సోమవారంనాడుఒక ప్రకటనలో తెలిపింది. నాసిక్ క్యాంపస్‌కు చెందిన ఓ ఉద్యోగిని తన సహోద్యోగి పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ క్రమంలో మరికొందరు ముందుకు వచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు ఇచ్చారు. హెచ్‌ఆర్ మేనేజర్ సహా ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు. మారువేషంలో క్యాంపస్‌లోకి ప్రవేశించారు.

ఓ మహిళా ఉద్యోగిని మరో ఉద్యోగి వేధిస్తున్నది వారి కంట పడింది.ఈ కేసు విచారణ క్రమంలో మిగతా ఫిర్యాదులపై కూడా దర్యాప్తు జరిపారు. సిసిటివి ఫుటేజీలను పరిశీలించిన హెచ్‌ఆర్ మేనేజర్ అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, రజా మేమన్, తౌసిక్, షారుఖ్, డానిష్ షేక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరు సహోద్యోగులను అనుచితంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, మాంసాహారం తినమని బలవంతం చేయడం ఇలాంటివి గుర్తించారు. ఈ ఘటనపై కేంద్ర కార్మిక శాఖకు ఐటి ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. మరోవైపు నాసిక్ క్యాంపస్ వ్యవహారంపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. బాధ్యులైన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, చీఫ్ ఆపరేటింగ్ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణకు కూడా ఆదేశించినట్లు తెలిపారు.