
న్యూఢిల్లీ: పశ్చియాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే దుబాయ్‌తో పాటు పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం 444 విదేశీ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఎన్ని విమానాలు రద్దవనున్నాయి. ఎన్ని ఆలస్యమవ్వనున్నాయనే విషయంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి 28న 410 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాల్లోని ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు పలువరు సీనియర్ అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార్ ‘ఎయిర్‌సేవ’కు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో 105 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు.