Reading Time: < 1 minute

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రయాదవ్ తెలిపారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా, ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఉదయం భద్రతా బలగాలు, డిఆర్ జి, సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా బలగాలకు తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల పైకి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు, కాల్పుల అనంతరం సంఘటన ప్రదేశాన్ని పరిశీలించగా పురుష మావోయిస్టు మృతదేహం,

మరొక మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు బహిరంగడ్ ఏరియా కమిటీకి చెందిన హిచామీ మద్ద, మంకీ పోడియంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. అలాగే సంఘటన ప్రాంతం నుండి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఎస్‌ఆర్ రైఫిల్స్, ఇన్సస్ రైఫిల్స్, 12 బోర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు చెందిన నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు బస్తర్ రేంజ్ ఐజి పి సుందర్ రాజ్ తెలిపారు.