Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో పరాజయం పాలై.. భారత్ సెమీస్‌కు వెళ్లే మార్గాన్ని సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో ఈరోజు జింబాబ్వేతో, ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగే మ్యాచుల్లో భారీ తేడాలతో విజయం సాధించి రన్‌రేటును మెరుగుపర్చుకుంటే సెమీస్‌కు వెళ్లే మార్గం సుగమం అవుతోంది. దీంతో నేడు జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌ను సూర్యకుమార్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే భారత్‌కు వెస్టిండీస్‌ కంటే జింబాబ్వేతోనే ముప్పు పొంచి ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు.

‘‘జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో వెస్టిండీస్ మనకంటే ఓ అడుగు ముందుంది. సౌతాఫ్రికా – వెస్టిండీస్‌ ఫలితం మీదే అంతా ఆధారపడి ఉంది. వెస్టిండీస్ కంటే.. జింబాబ్వేతోనే భారత్‌కు ఎక్కువ ముప్పు పొంచి ఉంది’’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నారు. ‘‘ప్రస్తుతం సెమీఫైనల్ ఆశలు జింబాబ్వే కంటే వెస్టిండీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడిస్తే.. భారత్ పని ముగిసినట్లే. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా జింబాబ్వేను ఓడించాల్సి వస్తుంది’’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.