
మన తెలంగాణ/ బోడుప్పల్ : గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చదువుతున్నాడని గుర్తించిన భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. సదరు వ్యక్తి బెదిరించడంతో భయాందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇవ్వడంతో బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.