
అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎపి శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టిడిపి, వైసిపి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాసనమండలిలో నిమ్మల ప్రసంగించారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని, 2020 లోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేశారని విమర్శించారు. అప్పుడు జగన్ సిఎంగా ఉన్న విషయం వైసిపి సభ్యులకు తెలియదా? అని నిమ్మల ప్రశ్నించారు. జగన్ పై బిఆర్ఎస్ నాయకులు చాలా చెప్పారని, తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారని అన్నారు. ఇక్కడ మనం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. 2020 సెప్టెంబర్ లో ఎన్ జిటి ఆర్డర్ ఇచ్చిందని, తాగునీరు కోసమే రాయలసీమ లిఫ్ట్ అని ఒజి ఇచ్చారని తెలియజేశారు. స్టే పక్కన పెట్టి పనులు చేస్తే రూ.2.65 కోట్లు ఎన్ జిటి ఫైన్ విధించిందని, డబ్బులు వచ్చే పనులు కూడా 2021 వరకే చేశారని మండిపడ్డారు. 2021 తర్వాత నాటి ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.