Reading Time: < 1 minute

ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిలెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్, భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్ లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ శాఖ షాక్‌కు గురైంది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి మొహంతిని మంగళవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్సు కోసం అతను రూ. 30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు.

పాటియా లోని శ్రీవిహార్‌లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌తోపాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీబ్యాగులు,అల్మరాల్లో ఆ డబ్బును దాచినట్టు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్‌లోంచి రూ.2 లక్షలు నగదు సీజ్ చేశారు. భువనేశ్వర్‌లో ఉన్న పహలా లోని రెండు అంతస్తుల బిల్డింగ్‌లో 130 గ్రాముల బంగారం గుర్తించారు. ఆ బిల్డింగ్‌తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.