Reading Time: 2 minutes

మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనత, ఆ పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డిలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది మాత్రమే కాకుండా, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. అంతేకాక ఎన్నికల సమయంలో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును తీసుకురావడం పైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుల అసలు ఉద్దేశ్యం మహిళల రిజర్వేషన్ కాదని, డిలిమిటేషన్ అంశమే ప్రధానమని సోనియా గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపుతో కూడిన డిలిమిటేషన్ రాజకీయంగా సమానత్వంతో ఉండాలని,

కేవలం గణితపరమైన లెక్కలతో మాత్రమే నిర్ణయించకూడదని ఆమె స్పష్టం చేశారు. “రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదన గురించి ప్రతిపక్షం ఒకసారి కాదు, ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసింది. అయినా అందరికీ ఉపయోగపడే ఈ అభ్యర్థనను ప్రధాని తిరస్కరించారు. దీనికి బదులుగా ప్రధానమంత్రి సంపాదకీయాల రాయడం, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు చేయడం, ఇతర సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘నా మాటే నెగ్గాలి’ అన్నట్లుగా ప్రధానమంత్రి వ్యవహరించడం విచారకరం. రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల వేళ ఈ అంశాలపై కేంద్రం పార్లమెంటులో చర్చ చేపట్టాలని చూస్తోంది అంటూ సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉదృ్ధతంగా జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయ లాభం పొందడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె అన్నారు. ప్రతిపక్షాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టడానికే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సోనియా గాంధీ వ్యాసాన్ని ఉటంకిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా స్పందించారు. మహిళల రిజర్వేషన్ ప్రక్రియలో తొందరపాటు డిలిమిటేషన్ వల్ల అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.2023లో ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం, మహిళల రిజర్వేషన్ అమలు తదుపరి జనగణన, డిలిమిటేషన్ పూర్తైన తర్వాతే అమలులోకి రావాల్సి ఉందని సోనియా గాంధీ గుర్తుచేశారు.

అయితే ప్రతిపక్షం ఈ షరతును కోరలేదని, వెంటనే అమలు చేయాలని అప్పట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారని తెలిపారు. ఇప్పుడేమో 2029 నుంచే మహిళల రిజర్వేషన్ అమలు చేయాలనే సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని, అయితే ఈ నిర్ణయానికి 30 నెలలు ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. కొన్ని వారాలు వేచి అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల చివరి దశ (ఏప్రిల్ 29) అనంతరం అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం మూడుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ప్రభుత్వం తిరస్కరించిందని ఆమె తెలిపారు. బదులుగా వ్యాసాలు రాయడం, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు.

మహిళల రిజర్వేషన్ చట్టం 73వ, 74వ రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏర్పడినదని, వాటి ద్వారా పంచాయతీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారని ఆమె గుర్తుచేశారు. 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, జాతీయ ఆహార భద్రత చట్టం కింద సుమారు 10 కోట్ల మంది ప్రయోజనాల నుంచి దూరమయ్యారని సోనియా గాంధీ ఆరోపించారు. ఐదేళ్ల ఆలస్యానంతరం మాత్రమే జనగణన ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆమె తెలిపారు.