Reading Time: 2 minutes

పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగింది. అమెరికా అన్నంత పని చేస్తోంది. ఇరాన్‌కు చెందిన హర్మూజ్ జలసంధితో పాటు అన్ని రేవులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించినట్లుగానే సోమవారంనాడు ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇరాన్ పోర్టుల వైపు వచ్చి, వెళ్తున్న నౌకలను అడ్డుకోవడం ప్రారంభించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు అమెరికా వివిధ దేశాల నౌకలను దిగ్బంధించడం మొదలుపెట్టింది. ఇరాన్ పోర్టుల్లోకి వచ్చి వెళ్లే అన్ని దేశాల నౌకలను అమెరికా నావికాదళం అడ్డుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు చర్యకు దిగాయి. ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించింది.

అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు. హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. . ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు.

అమెరికా బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది. మరోవైపు ఈ దిగ్బంధనం సెగ భారత్‌ను కూడా తాకింది. హర్మూజ్ జలసంధి మీదుగా రావాల్సిన 15 భారత నౌకలు చిక్కుకుపోయినట్లు సమాచారం. వీటిలో అధికంగా ఎల్‌పిజి, ముడి చమురు ట్యాంకర్లు ఉన్నాయి.

అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు.