
నిజామాబాద్ లో గత మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్నదాతల ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు ఒక్కసారిగా మార్కెట్ కమిటీ కార్యాలయంపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో కార్యాలయ అద్దాలు పగిలిపోయి, ప్రాంగణమంతా గందరగోళం నెలకొంది. మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లకు ఆధునిక సాంకేతికతను జోడించే క్రమంలో చేపట్టిన ఈ-నామ్ 2.0 వెర్షన్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. గత మూడు రోజులుగా పాత వెర్షన్ (1.0) పనిచేయకపోవడం, కొత్త వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. పాత సాఫ్ట్‌వేర్ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. వారం రోజులుగా వాతావరణం అనుకూలించడం లేదు.
ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం పడుతుందోనని భయపడుతున్నాం. ఇలాంటి స్థితిలో మూడు రోజులుగా కొనుగోళ్లు ఆపేస్తే మా గతేం కావాలి?‘ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌కు పసుపు తెచ్చి రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లే సమయంలో జరిగిన తోపులాట వల్ల కిటికీల అద్దాలు విరిగిపడ్డాయి. అధికారులు, సిబ్బంది రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సాంకేతిక మార్పులు చేసే సమయంలో ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో మార్కెట్ కమిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. అప్లికేషన్ అప్‌గ్రేడ్ అయ్యే వరకు మాన్యువల్‌గానైనా లేదా పాత పద్ధతిలోనైనా కొనుగోళ్లు జరపాల్సి ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి, పసుపు కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతున్నారు.