Reading Time: 3 minutes

దారిద్య్రానికి పూచిన పువ్వులు దయనీయమైన జీవితాల్ని వెళ్ళదీస్తున్నాయి. తల్లిపాలు అందక తల్లడిల్లుతున్న శిశువులు ఎంతో మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారులు ఆకలితో నకనకలాడుతూ ఫుట్‌పాత్‌ల మీద తచ్చాడుతున్నారు. బుక్కెడు తిండికోసం హోటళ్ళలో కప్పులు కడుగుతున్నారు. కార్ఖానాలలో తాహతుకు మించి బరువులు మోస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ ప్రపంచ దేశాలవైపు దీనంగా చూస్తూనే వున్నాయి. లెక్కకు అందని సంఖ్యలో పిల్లలు పేదరికంలో మగ్గుతున్నారు. ఆర్ధికాభివృద్ధి ఈ పిల్లలకు సహాయపడటంలో విఫలమవుతోంది. మన దేశంలో ఆధ్యాత్మిక సంస్థల ముందు అందించే ఉచిత ఆహార పదార్థాలకోసం ఎంతో మంది పేదపిల్లలు చేతులు చాస్తున్నారు. రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై నిద్రపోతున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అడుక్కుంటున్నారు. వీళ్ళందరికీ చేరువ కావడంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఫలమవుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పేద పిల్లలకు ఉద్దేశించిన పథకాలేవీ వారికి అందడంలేవు. దీంతో దారిద్య్రరేఖకు దిగువున జీవనం సాగిస్తున్న పిల్లల సంఖ్య అయోమయంగా ఉంది. ఆకలి, కలుషిత వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు.

మిలియన్ల సంఖ్యలో జీవనం సాగిస్తుండగా, ఆర్థికాభివృద్ధి వీరి వెనుక తచ్చాడుతోంది. ఈ విషయాన్ని పేదరికంలో మగ్గుతున్న పిల్లల మరణాల సంఖ్యను స్పష్టం చేసున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న పిల్లలు తమ ఐదవ పుట్టినరోజు జరుపుకోకుండానే మరణిస్తున్నారు. ఈ మరణాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్న పిల్లలతో పోలిస్తే ఎక్కువ. ఇక, పుట్టిన కొద్ది రోజులలో మరణిస్తున్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ మరణాల లెక్కలు చెప్పుకోవడం విచారకరమైన విషయంగా భావించాలి. పేదరికం, ఆకలి, లైంగిక అసమానత, నిరక్షరాస్యత తదితర అంశాలను 2000 సంవత్సరం నాటికి రూపుమాపడానికి యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన లక్ష్యాలు నీరుగారిపోయాయి. గత 25 సంవత్సరాలుగా ఊహించనంతగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి జరిగింది. పేద, ధనికుల మధ్య తారతమ్యం లేకుండా పోయిందని యునైటెడ్ నేషన్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 40 కోట్ల మంది పిల్లలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నట్లు 2023 నాటి యునిసెఫ్ నివేదికలు వెల్లడించాయి. ఆహారం, నీరు, ఆశ్రయం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కనీస అవసరాలు లేని బహుముఖీయ పేదరికం అనుభవిస్తున్న పిల్లల సంఖ్య సుమారు 900 మినియన్ల వరకు ఉంటుందని అంచనా. గత దశాబ్దంతో పోలిస్తే తీవ్ర పేదరికంలో ఉన్న పిల్లల సంఖ్య దాదాపు 50 మిలియన్లు తగ్గగా; కోవిడ్ 19, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ఈ తగ్గుదల క్షీణించింది. ప్రతి ఆరుగురు పిల్లల్లో ఒకరు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా నగరాకు వలస వస్తున్న పేదల సంఖ్య పెరగడం, దీనికనుగుణంగా మురికివాడల సంఖ్య పెరుగుతుండడం ఆర్థ్ధికాభివృద్ధికి సవాలుగా మారింది. రేపటి తల్లిదండ్రులుగా మారే నేటి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలను తీర్చగలిగే ఆర్థికాభివృద్ధికి పరిమితం కావలసిన అవసరముందని నివేదిక చెప్పకనే చెబుతోంది. మన దేశం విషయానికొస్తే, ఆర్థిక విస్తరణ బలంగా ఉన్నప్పటికీ, పేద పిల్లల సమస్య దశాబ్ద కాలానికిపైగా జటిలంగా మారింది. 23 కోట్ల 68 లక్షలకుపైగా పిల్లలు ఉండగా, వీరిలో 11.45 శాతం మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలు చిన్న చిన్న పనుల్లో కొనసాగుతున్నారు. బాల కార్మికులుగా 14 నుంచి 17 ఏళ్ల పిల్లలు సుమారు 63% ఉన్నారు. పేదరికంతో చాలా మంది పిల్లలు ఫుట్‌పాత్‌ల మీద పడుకోవడం, ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు వీరికోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఒక రోజు కూడా కడుపునిండా తిండిని అందించలేకపోతున్నాయి. పేదరికం పిల్లలను అపాయకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి.

తెలిసీ తెలియని వయస్సులో వివాహం, భద్రత లేని ఉపాధి… తదితర కారణాలు మానసికాందోళనకు గురిచేస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలకు దారితీయిస్తున్నాయి. ఈ దారుణమైన పరిస్థితులపై దేశం దృష్టి సారించకపోతే, 2030 నాటికి 68 మిలియన్ల పిల్లలు తమ వయస్సు ఐదు దాటకముందే మరణించే అవకాశముంటుందని యునిసెఫ్ స్పష్టం చేసింది. అంతేకాదు, మరో 119 మిలియన్ల పిల్లలు తీవ్రమైన లోపపోషణకు గురికానున్నట్లు హెచ్చరించింది. ఒక్క భారత్‌లోనే అపాయకరమైన వ్యాధులు ప్రబలి ఏడాదికి ఏడు లక్షల మంది పిల్లలు మరణించే పరిస్థితులు నెలకొంటాయని వివరించింది. ఇదికాస్త ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యం పేద పిల్లలవైపు చూపుసారిస్తూ కొంతమేరకు అభివృద్ధి సాధించినట్లుగా యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. 1990 నుంచి తీవ్రమైన లోపపోషణ 41 శాతం, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు సగానికిపైగా తగ్గినట్లు పేర్కొంది.

దీనికితోడు గర్భస్థ మరణాలు 45 శాతానికి తగ్గినట్లు తెలిపింది. రెండు బిలియన్ల పేద పిల్లలకు సురక్షిత మంచినీరు అందుతుండడంవల్లే ప్రజారోగ్య అభివృద్ధి సాధ్యపడుతున్నట్లు వివరించింది. 2013లో ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాలలోని హింసాత్మక సంఘటనలు, నేపాల్‌లోని ప్రకృతి వైపరీత్యాలు, ఫిలిఫీన్స్‌లోని అంటువ్యాధులు, యుద్ధాలు తదితర కారణాలు అభివృద్ధి తిరోగమనం వైపు మళ్ళించింది. దీంతో పేద పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో యునైటైడ్ నేషన్స్ ‘సాధించే దిశలో అభివృద్ధి లక్ష్యాలు’ పేరిట అన్ని దేశాల్లో నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రవేశపెట్టింది. పేదరిక నిర్మూలన, ఆకలి లేని సమాజం, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, పరిశుభ్రమైన నీరు, వాతావరణ చర్య వంటి అభివృద్ధి లక్ష్యాలు సాధించాలన్న దిశగా ప్రయాణం సాగిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకుని అభివృద్ధి పథంలో నడవాలని కాంక్షిస్తోంది. 

– కోడం పవన్‌కుమార్

9848992825