Reading Time: < 1 minute

రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని ఎక్స్‌లో ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు.

కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి , మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇళ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు , రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.