Nagabandham OTT Release: 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘నాగబంధం’.. ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నాగబంధం’. భారీ అంచనాల మధ్య జూలై 3, 2026న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ నిరాశపరిచింది. సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.
21 రోజుల్లోనే ఓటీటీలోకి..
అయితే ఈ సినిమా విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ సినిమా జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ విడుదలపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బుల్లితెరపై మెప్పిస్తుందా?
థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల థియేటర్లలో ఆశించిన ఫలితం సాధించని పలు చిత్రాలు ఓటీటీలో భారీ వ్యూయర్‌షిప్ సాధించాయి. ఇప్పుడు ‘నాగబంధం’ ‘ కూడా అదే జాబితాలో చేరుతుందన్న ధీమాగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా భారతదేశంలోని ప్రాచీన విష్ణు దేవాలయాలు, వాటికి సంబంధించిన నాగబంధం అనే పురాతన రహస్యం , దాగి ఉన్న నిధి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
విజువల్ ఫాంటసీగా..
ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగర్కర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రల్లో నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించగా, జునైద్ కుమార్–అభే సంగీతం సమకూర్చారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వ్లాడ్ రింబర్గ్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ విజువల్ ఫాంటసీకి ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి.