Reading Time: < 1 minute
Barrier Free Tolling On Indian National Highways December Nitin Gadkari

జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత వేగంగా, సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘బారియర్-ఫ్రీ టోలింగ్’ (అడ్డంకులు లేని టోల్ సిస్టమ్) అమలు చేయనున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

ఏమిటీ కొత్త విధానం..?

సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో టోల్ గేట్లు (బారియర్లు) ఉండవు. వాహనాలు ఎక్కడా ఆగకుండానే తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది..?

ఈ వ్యవస్థలో రెండు రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వాడుతున్నారు. అందులో ఒకటి ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్).. హై-రిజల్యూషన్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తాయి. మరొకటి FASTag and AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాహనాన్ని గుర్తించి, నేరుగా మీ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) ఖాతా నుండి టోల్ డబ్బు కట్ అవుతుంది. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చాలంటే రవాణా ఖర్చులను తగ్గించాలని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం 16 శాతం ఉన్న ఈ ఖర్చులను 10 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎవరైనా టోల్ చెల్లించకుండా తప్పించుకోవాలని చూస్తే, వారికి ఈ-నోటీసులు పంపిస్తారు. సకాలంలో స్పందించకపోతే ఫాస్ట్‌ట్యాగ్ రద్దు చేయడం లేదా వాహన్ (VAHAN) సాఫ్ట్‌వేర్ ద్వారా జరిమానాలు విధిస్తారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 10,000 కిలోమీటర్ల మేర ఈ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టోల్ ప్లాజాల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, సిగ్నల్ ఫ్రీ జర్నీని అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇది అమలైతే అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఉన్న తరహాలోనే మన దేశంలో కూడా హైవేలపై ప్రయాణం నిరంతరాయంగా సాగుతుంది.