
ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీతో పలు హిట్ చిత్రాల్లో నటించి హిట్ జోడిగా ఖ్యాతి పొందిన శివాజీ, లయలు ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు. శివాజీ, ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా, ఈటీవీ వాళ్లకు ఏది చెప్పమో అదే తీశాం. బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీకి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్‌గా నవ్వుకున్నారు.
ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది”అని అన్నారు. లయ మాట్లాడుతూ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలియజేశారు. బన్నీవాస్ మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల చేయడానికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను చూసిన ఆయన ఇది పక్కా థియేట్రికల్ సినిమా, థియేటర్‌లో రిలీజ్ చేయమని చెప్పారు. శివాజీ కూడా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా నుంచి త్వరలోనే ఓ కొత్త ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, వంశీ నందిపాటి, అలీ పాల్గొన్నారు.