Reading Time: < 1 minute

కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్ముకశ్మీర్ టీమ్ బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరును సాధించింది. వర్షం వల్ల రెండో రోజు ఆటను ముందుగానే నిలిపి వేయాల్సి వచ్చింది. 284/2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన కశ్మీర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు శుభమ్ పుందిర్ (121), అబ్దుల్ సమద్ (61)లను కర్ణాటక బౌలర్లు ప్రారంభంలోనే పెవిలియన్ పంపించారు. అయితే ఆ తర్వాత కశ్మీర్ బ్యాటర్లు మెరుగ్గా ఆడారు.

రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిన కెప్టెన్ పరాస్ డోగ్రా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కన్హియా వాద్వాన్‌తో కలిసి డోగ్రా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వాద్వాన్ 9 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. డోగ్రా 8 బౌండరీలతో 70 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి సాహిల్ లోత్రా (57), ఆబిద్ ముస్తాక్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.