Reading Time: 2 minutes
Left Parties Launch Statewide Protest Against Petrol Diesel And Gas Price Hike

Left Parties Protest: వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్‌, సీఎన్‌జీ ధరలు.. సామాన్యులకు భారంగా మారుతున్నాయి.. క్రమంగా అన్ని వస్తువులపై వీటి ప్రభావం పడుతోంది.. అయితే, విజయవాడలో వామపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. లెఫ్ట్‌ పార్టీల ప్రెస్‌ మీట్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల వల్లే ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని విమర్శించారు.

జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష నేతలు వెల్లడించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా పాసర్లపూడిలోని కేజీ బేసిన్ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
సీఎం చంద్రబాబు నాయుడు రోజూ పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల పేరుతో ప్రకటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారని, కానీ ధరల పెరుగుదల వల్ల ఎంత మంది ఉపాధి కోల్పోయారో లెక్కలు చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “పొదుపు చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబులే పాటించడం లేదు” అని వ్యాఖ్యానించారు.

లోకేష్ హామీలపై ప్రశ్నలు
ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేసిన వామపక్ష నేతలు, ఇప్పుడు ఎందుకు ఆ హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించకపోవడం ఏమిటని నిలదీశారు. అంతే కాదు.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను తక్షణమే తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే మహానాడులోనే ఇంధన ధరల తగ్గింపుపై తీర్మానం చేయాలని కోరాయి.. కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే వనరుల్లో 50 శాతం రాష్ట్ర ప్రజల అవసరాలకు వినియోగించేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ ధరలను పాత ధరలకే అందించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని, వెంటనే కేంద్రం మరియు రాష్ట్రం ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి లెఫ్ట్‌ పార్టీలు..